12 July, 2026 | 6:03 AM

బజరంగ్‌పై సస్పెన్షన్!

06-05-2024 02:39 AM

డోపింగ్ శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు షాక్ తగిలింది. డోపింగ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో బజరంగ్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఒలింపిక్స్‌లో బజరంగ్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న  భజరంగ్ పూనియా నుంచి మూత్ర నమూనాలను కోరింది. కానీ ఆయన మాత్రం శాంపిల్ ఇవ్వకుండానే అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఇతర ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్  చేస్తున్నట్లు నాడా తెలిపింది. దీంతో బజరంగ్ త్వరలో ఒలింపిక్స్ కోసం నిర్వహించనున్న ట్రయల్స్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.

కాగా నాడా ఆరోపణలపై బజరంగ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘నాడా అధికారులకు నమూనాలు ఇచ్చేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. గడువు ముగిసిన టెస్టు కిట్లు ఇచ్చారు. వాటిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తొలుత సమాధానం చెప్పాలని కోరాను. ఆ తర్వాత నన్ను పరీక్షించిండి అని విజ్ఞప్తి చేశా. దీనిపై మా న్యాయవాది వారికి త్వరలోనే సమాధానం ఇస్తారు’ అని పేర్కొన్నాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో బజరంగ్ పూనియా కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డబ్ల్యూఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన వారిలో బజరంగ్ ముందు వరుసలో ఉన్నాడు. సహచర రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్‌లతో కలిసి పోరాటానికి దిగాడు.