23 April, 2026 | 12:01 AM

కబళించిన మృత్యువు

09-12-2024 12:39 AM
  • బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
  • ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి
  • జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘటన

గజ్వేల్, డిసెంబర్ 8: సికింద్రాబాద్ ఈసీఐఎల్‌లో ఆదివారం జరిగిన రన్ జాతరలో పాల్గొనడానికి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. గజ్వేల్‌లోని రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో పరంధాములు(43), దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో పూస వెంకటేశ్వర్లు (42) కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వరకు విధులు పూర్తిచేసుకుని.. సికింద్రాబాద్ ఈసీఐఎల్‌లో ఆదివారం జరుగనున్న రన్ జాతరలో పాల్గొనడానికి గజ్వేల్ నుంచి ఇద్దరూ కలిసి బైక్‌పై బయలుదేరారు.

మార్గమధ్యలో జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాలను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ మధు మృతదేహాలను పరిశీలించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా అనిన బెనిఫిట్స్ అందేలా చూస్తామని కమిషనర్ అనురాధ తెలిపారు. గజ్వేల్ ఇన్‌చార్జి ఏసీపీ మధు, సీఐ సైదా పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి.. మృతుల అంత్యక్రి యలకు రూ.60వేలు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.