10 July, 2026 | 1:05 AM

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ నూతన ట్రస్ట్‌బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

10-07-2026 12:00 AM

పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, జూలై 9 (విజయక్రాంతి): సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నియమించిన నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆలయకార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన సభ్యులను డాక్టర్ కోట నీలిమ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు సేవాభావంతో పనిచేసి దేవాలయ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

రాబోయే బోనాల మహోత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అత్యంత వైభవంగా జరిగేలా ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయం తో పనిచేయాలని సూచించారు. భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ అమ్మవారి సేవలో నిబద్ధతతో పనిచేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించేందుకు కృషి చేసిన డాక్టర్ కోట నీలిమ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.