10 July, 2026 | 2:05 AM

భక్తుల వసతికి సరళ నిలయం

10-07-2026 12:00 AM

వేములవాడ, జూలై 9, (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర సదన్లో నిర్మించనున్న ’సరళ నిలయం’ అతిథి గృహానికి గురువారం వేదమంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేశారు. ఈ అతిథి గృహ నిర్మాణానికి మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్కుమార్, ఏకశిల ఎడ్యుకేషన్ సొసైటీ (వరంగల్) దాతలుగా సహకరిస్తున్నారు.

ఇప్పటికే 2007లో నిర్మించిన అతిథి గృహం పైభాగంలో భక్తుల వసతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం దాతలు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ శేషవస్త్రం, కండువా, లడ్డూ ప్రసాదంతో దాతలను సత్కరించారు. అతిథి గృహం పూర్తయిన అనంతరం వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.