13-11-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, నవంబర్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రిజర్వాయర్లకు, చెరువులకు మత్స్య శాఖ ద్వారా చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణిని సొసైటీల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కలెక్టర్ వి సి ఛాంబర్ లో వీడియో కాన్ఫి రెన్స్ ద్వారా పంచాయతీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, మత్స్య శాఖ అధికారులు, సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 80-100 మి.మి. ల పొడవు ఉన్న పెద్ద చేప పిల్లలను పులిచింతల, యాతవాకిళ్ల రిజర్వాయర్లకు 37.99 లక్షల పెద్ద చేప పిల్లలు,186 శాశ్వత చెరువులకు 2.02 కోట్ల పెద్ద చేప పిల్లలు, 35-40 మి.మి. ల పొడవు ఉన్న 97.67 లక్షల చిన్న చేప పిల్లల్లను 431 సీజనల్ కుంటల కు మొత్తం 4.40 కోట్ల రూపాయలతో కట్ల(బొచ్చ), రోహు(మోష్), మృగాల (గడ్డిచెప ) జాతులకు చెందిన 3.3816 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.
రిజర్వాయర్ ల పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా ఇరిగేషన్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్యశాఖ పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడు,10 మంది లైసెన్స్ ఉన్న సభ్యులు లతో కమిటీ ఏర్పాటు చేయాలని, శాశ్వత చెరువులు సొసైటీ పరిధిలో జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా అతని తరఫున ప్రతినిధి,ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్,పదిమంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అవుతుందన్నారు.
అలాగే సీజనల్ కుంటలలో జిల్లా మత్స్య శాఖ అధికారి తరపున ఒక ప్రతినిధి, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, అట్టి చెరువు సొసైటీ ప్రెసిడెంట్,సొసైటీలోని 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పడుతుందని, ఆయా కమిటీ ఆధ్వర్యంలోనే చేప పిల్లలను రిజర్వాయర్లు, చెరువులు కుంటలలో పంపిణి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ కె సీతారామా రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి నాగులు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.