17-02-2026 01:43:48 AM
జేఈఈ మెయిన్ పేపర్1 ఫలితాలు విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్-1 పేపర్1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. తొలిసారిగా 12 మందితో 100 పర్సెంటైల్ సాధించిన వారి పేర్లను ప్రకటించారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురున్నారు. తెలంగాణ నుంచి వివన్ శరద్ మహీశ్వరి.. ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ ఉన్నారు. దీంతోపాటు జనరల్ కేటగిరీ విభాగంలో ఏపీ నుంచి పసల మోహిత్, తెలంగాణ నుంచి వివన్ శరద్ మహీశ్వరి వంద పర్సెంటైల్ సాధించారు.
ఓబీసీ కేటగిరీలో టాపర్‌గా నరేంద్రబాబు గారి మహిత్, ఎస్సీ విభాగంలో ఏపీ నుంచి దేవ శ్రీవేద్ నిలిచారు. సోమవారం ఉద యం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేవాలకు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-1 పేపర్1 పరీక్షను నిర్వహించారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13,55,293 మంది దరఖాస్తు చేసుకోగా, 13,04, 653 మంది (96.26 శాతం) హాజరయ్యారు.
మొదటి విడతలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తారు. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. రిజర్వేషన్ల వారీగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు. ఇందులో సత్తాచాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జనవరి 29న నిర్వహించిన పేపర్2 ఫలితాలను తర్వాత ప్రకటించనున్నారు.