23 April, 2026 | 5:33 PM

3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు

23-04-2026 04:20 PM

చెన్నై: తమిళనాడు, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, గురువారం తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. భారత ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఓటింగ్ శాతం సరిగ్గా 70 శాతంగా నమోదైంది. 75.79 శాతం ఓటింగ్ శాతంతో సేలం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉత్సాహంగా సాగినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు, బెదిరింపులు, బీజేపీ అభ్యర్థులపై జరిగిన దాడులు పోలింగ్‌పై నీలినీడలు కమ్మేలా చేశాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి, మొత్తం 3.60 కోట్ల మంది ఓటర్లలో 78.77 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో కీలకమైనదిగా భావిస్తున్న ఈ పోలింగ్‌లో, 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశలోనే ప్రజలు ఓటేసేందుకు బూత్‌ల బయట భారీగా క్యూ కట్టారు. మొదటి రెండు గంటల్లో 18.76 శాతంగా నమోదైన పోలింగ్ శాతం, ఉదయం 11 గంటలకల్లా 41.11 శాతానికి, మధ్యాహ్నం 1 గంటకల్లా 62.18 శాతానికి క్రమంగా పెరిగి, మధ్యాహ్నానికి 78 శాతం మార్కును అధిగమించింది. పోలింగ్‌కు ఇంకా మూడు గంటల సమయం మిగిలి ఉన్నందున, తుది పోలింగ్ శాతం గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.