మరో వివాదంలో తాండూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం..!
డిప్యూటేషన్ లో ఉన్న అధికారి నేడు కార్యాలయంలో ప్రత్యక్షం
తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నాలుగు మాసాల క్రితం ఇన్చార్జి సబ్ రిజిస్టర్ సాయి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా అప్పట్లో జిల్లాలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. సాయి సస్పెండ్ అయిన తర్వాత ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ యాదవ్ విధులు నిర్వహించి ఎడాపెడా రిజిస్ట్రేషన్ ఫీజులు ఇష్టానుసారంగా పెంచడంతో ఉన్నతాధికారులు చేవెళ్లకు డిప్యూటేషన్ పై పంపించారు.
గత రెండు మూడు రోజుల నుండి తాండూరు కార్యాలయంలో తిష్ట వేసి ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్చార్జి సబ్ రిజిస్టర్ తో కలిసి ముఖ్యమైన దస్త్రాలు, రికార్డులు పరిశీలించాడు. మీడియా రాకను గమనించిన సదరు అధికారి శ్రీనివాస్ యాదవ్ ముఖానికి మాస్క్ పెట్టుకొని కార్యాలయం నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. మీడియా ప్రతినిధులు మీరు ఇక్కడ విధులు నిర్వర్తించడం లేదు కదా? మరి ఇక్కడ మీకేం పని ? అని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ, దురుసుగా ప్రవర్తిస్తూ కార్యాలయం నుండి పారిపోయాడు . కార్యాలయంలో ప్రధాన దస్త్రాలు , రికార్డులు ఉండడంతో అవినీతి, అక్రమాలు జరిగే ఆస్కారం ఉందని స్థానికులు, డాక్యుమెంట్ రైటర్లు అంటున్నారు.






