రేపే ‘తపస్’ మహాధర్నా
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వర కు ఉద్యమాలు తప్పవని, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వం మెడలు వంచేందుకే శనివారం (ఆగస్ట్ 1న) ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు ఉపాధ్యాయులు వేలాదిగా తరలిరావాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ స్పష్టం చేసింది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంపై గురువారం తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వోద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. పీఆర్సీ ఫిట్‌మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లకు సంబంధించి ఈ కుబేర్‌లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. 6 డీఏల ప్రకటన, సమ్మెకాలపు వేతనాలు, ఎంటీఎస్ అమలు, 010 పద్దు అమలు, జీవో 190, 2003 డీఎస్సీ ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు అంశం పరిష్కారం తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
టెట్‌లో 40 శాతం మార్కులకు అర్హత, ఎస్సీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెల్త్‌కార్డులు, శాలరీల్లో కోత, అసంబద్ధంగా ఉన్న ట్రస్ట్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు సకాలంలో చెల్లింపులు, ఉపాధ్యాయులకు వార్షిక ప్రమోషన్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు ఉద్యమాలు తప్పవని వొద్నాల, తెల్కలపల్లి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.






