ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, మార్చి 31 (విజయక్రాంతి): నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం నాయకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రారాజు ఫంక్షన్ హాల్లో జరిగిన అల్లమయ్య గుట్ట ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు చెన్నమాధవుని శ్రీదేవి భాస్కర్ రాజు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ సమాజ చైతన్యానికి, యువత సరైన మార్గంలో ఎదగడానికి ఉపాధ్యాయుల సేవలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉంటారన్నారు.
తన దృష్టిలో గుడి కంటే బడి, వైద్యశాల చాలా పవిత్రమైనవని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు. అన్ని ఉద్యోగాలలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, జాబ్ సాటిస్పెక్షన్ ఎక్కువగా ఉండే వృత్తి ఇదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన హెడ్మాస్టర్ శ్రీదేవి దంపతులను ఎమ్మెల్యే సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, కోరుట్ల మండల విద్యాధికారి నరేశం, పాఠశాల సిబ్బంది, పదవి విరమణ పొందిన శ్రీదేవి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొన్నారు.






