31 August, 2026 | 2:21 AM

మన సత్తా ఎంత?

24-05-2024 12:45 AM

ఐపీఎల్ 17వ సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. ఇన్నాళ్లు ఐపీఎల్లో ఆయా జట్ల తరపున ప్రత్యర్థులుగా కనిపించిన టీమిండియా ఆటగాళ్లు ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం మళ్లీ ఒకటిగా ఏకమవ్వనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. కప్ సాధించాలనే కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ టీమిండియా ఈ నెలాఖరులోగా అమెరికాలో అడుగుపెట్టనుంది. అయితే వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న పొట్టి ప్రపంచకప్ సాధించడంలో మనకు ఎంత సత్తా ఉందనేది ఆసక్తికరం. 

ఈసారైనా అందుకుంటారా?

అప్పుడెప్పుడో 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ధోనీ నాయకత్వంలోని అప్పటి కుర్ర జట్టు ఈ అద్భుత ఘట్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు పొట్టి ప్రపంచకప్‌ను అందుకున్న దాఖలాలే లేవు. మధ్యలో 2014లో ఒకసారి ఫైనల్ చేరిన టీమిండియా శ్రీలంక చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. ప్రతీసారి మంచి అంచనాలతో బరిలోకి దిగడం కీలకపోరులో చేతులెత్తేయడం భారత్‌కు అలవాటుగా మారిపోయింది. ఈసారి వెస్టిండీస్ లాంటి ఫాస్ట్ పిచ్‌లపై మెగా టోర్నీ జరగనుండడంతో టీమిండియా ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2007 వన్డే ప్రపంచకప్ వెస్టిండీస్ వేదికగానే జరిగింది. ద్రవిడ్ నాయకత్వంలోని అప్పటి భారత జట్టు ఘోర ప్రదర్శనతో లీగ్ దశలోనే వెనుదిరిగింది. విండీస్ వేదికలు మనకు అచ్చిరావనే ముద్ర పడిపోయింది. తాజాగా మరోసారి అదే గడ్డపై టోర్నీ జరగనుండడంతో రోహిత్ సేన ఆ చేదు జ్ఞాపకాల్ని మరిపించి కప్ కొడుతుందా అన్నది చూడాలి. ఇక జట్టులో సీనియర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కానుంది. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ బరిలోకి దిగని ఈ ఇద్దరు మరోసారి కీలకం కానున్నారు. 2007 నుంచి వరుసగా అన్ని టీ20 ప్రపంచకప్‌లు ఆడుతూ వచ్చిన రోహిత్ 39 మ్యాచ్‌ల్లో 127.88 స్ట్రయిక్‌రేట్‌తో 963 పరుగులు సాధించాడు.

ఇక 2012లో తొలి టీ20 ప్రపంచకప్ ఆడిన కోహ్లీకి మెగా టోర్నీలో ఘనమైన రికార్డు ఉంది. 27 మ్యాచ్‌ల్లో 131.30 స్ట్రయిక్ రేట్‌తో 1141 పరుగులు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రోహిత్ 417 పరుగులతో పర్వాలేదనిపించగా.. కోహ్లి మాత్రం 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జట్టు విషయానికి వస్తే రోహిత్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అదనపు బౌలర్ అవసరమనుకుంటే కోహ్లీ ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది లేదంటే వన్‌డౌన్‌లో రావడం ఖాయం. టీ20 ప్రపంచ నంబర్‌వన్  సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో రానున్నాడు. ఈసారి సూర్యపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల ఐపీఎల్లో లేటుగా జాయిన్ సూర్య ముంబై ఇండియన్స్ తరపున మంచి ఇన్నింగ్స్‌లు ఆడడంతో సెంచరీతో మెరిశాడు. ఇక కీపర్‌గా రిషబ్ పంత్ కీలకం కానున్నాడు. రెండేళ్ల తర్వాత టీమిండియా తరపున ఆడనుండడంతో అతడి ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. గిల్, రింకూ సింగ్‌లను కాదని జట్టులో చోటు దక్కించుకున్న శివమ్ దూబే విండీస్ గడ్డపై ఎంత హిట్టింగ్ చేస్తాడన్నది చూడాలి. ఆల్‌రౌండర్లు హార్దిక పాండ్యా, రవీంద్ర జడేజాలు కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా పెద్దన్న పాత్ర పోషించనున్నాడు. అర్షదీప్, సిరాజ్, కుల్దీప్, చహల్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా సమతూకంగా ఉన్న టీమిండియా 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ టీ20 ప్రపంచకప్‌ను సాధించాలని కోరుకుందాం.