ఫైనల్ చేరేదెవరు?
నేడు క్వాలిఫయర్ పోరు
హైదరాబాద్, రాజస్థాన్ ఢీ
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన మన హైదరాబాద్ జట్టు తుది పోరుకు అర్హత సాధించేందుకు క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశం లభించింది. విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్ కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్ చేసిన పొరపాట్లను రిపీట్ చేయొద్దనే సంకల్పంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు ఎలిమినేటర్ పోరులో బెంగళూరును చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్న సంజూ సేన కీలక ఎలిమినేటర్ పోరులో మాత్రం జూలు విదిల్చి బెంగళూరుపై అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య జరగనున్న ఫైనల్ కాని ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కమిన్స్ సేన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేకేఆర్‌తో ఫైనల్ ఫైట్‌కు సిద్ధమవ్వాలని కోరుకుందాం!!
చెన్నై: ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య క్వాలిఫయర్ పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా శుక్రవారం జరగనున్న కీలక పోరులో గెలిచిన జట్టు ఆదివారం కోల్‌కతాతో ఫైనల్ ఫైట్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయం. కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్ పోరులో ఓటమిపాలైన హైదరాబాద్ లీగ్ దశను రెండో స్థానంతో ముగించడంతో ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశం లభించింది. 2016, 2018లో ఫైనల్లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇక లీగ్ తొలి దశలో వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో కొనసాగిన రాజస్థాన్ ఆ తర్వాత రేసులో వెనుకబడింది. రెండో దశలో పరాజయాలు పలకరించడంతో మూడో స్థానంతో లీగ్ దశను ముగించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ పోరులో జూలు విదిల్చిన రాజస్థాన్ విజయాన్ని నమోదు చేసుకుంది. 2008లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ 2022లో రన్నరప్‌గా నిలిచింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరి టైటిల్ ఒడిసిపట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే క్వాలిఫయర్ రిజర్వ్ డే ఉండడం సానుకూలాంశం.
ఆ ముగ్గురే కీలకం..
ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ పెట్టింది పేరు. గత సీజన్లతో పోలిస్తే అసలు ఆడుతుంది సన్‌రైజర్స్ హైదరాబాదేనా అన్నట్లుగా సాగుతుంది ఆ జట్టు విధ్వంసం. ఒకప్పుడు లో స్కోరింగ్‌లను కాపాడుకుంటూ 2016లో చాంపియన్‌గా నిలిచిన రైజర్స్ ఈసారి మాత్రం గేర్ మార్చింది. భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిపోయింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లు మరోసారి కీలకం కానున్నారు. లీగ్ దశలో పంజాబ్‌తో మ్యాచ్‌తో పాటు కీలకమైన క్వాలిఫయర్ ట్రావిస్ హెడ్ సున్నాకే వెనుదిరగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అయితే ఫామ్‌లో ఉంటే హెడ్‌ను ఆడపం కష్టతరం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడు క్రీజులో 10 ఓవర్లు నిలబడితే చాలు విధ్వంసం పతాకస్థాయికి చేరడం ఖాయం. అభిషేక్ శర్మ గత మ్యాచ్‌లో విఫలమైప్పటికి మంచి టచ్‌లోనే కనిపిస్తుండడంతో మరోసారి అతడి నుంచి భారీ స్కోరు చూసే చాన్స్ ఉంది. ఇక సీజన్ మధ్యలో జోరు ప్రదర్శించి ఆ తర్వాత తడబడి మళ్లీ తేరుకున్న క్లాసెన్ నుంచి బిగ్ హిట్టింగ్‌కు ఆస్కారముంది. ఇక వీళ్లకు తోడు చివరి రెండు మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లతో మెరిసిన రాహుల్ త్రిపాఠి మరోసారి కీలకం కానున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ 160 పరుగులు దాటిందంటే అదంతా త్రిపాఠి చలవే. ఇక షెహబాజ్ అహ్మద్ టచ్‌లో కనిపిస్తుండగా.. అబ్దుల్ సమద్ మెరవాల్సిన అవసరముంది. ఇక పాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోన్నప్పటికీ స్పిన్ విభాగం మాత్రం పర్వాలేదనపించేలా ఉంది.
టాపార్డర్ కీలకంగా..
ఇక రాజస్థాన్ రాయ ల్స్ బ్యాటింగ్ విషయానికొస్తే మరోసారి ఆ జట్టు టాపార్డర్ కీలకం కానుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో జైస్వాల్ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బట్లర్ దూరమవ్వడంతో అతడి స్థానంలో వచ్చిన కాడ్‌మోర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. సీజన్‌లో బ్యాటింగ్‌తో రాణిస్తున్న సంజూ (521 పరుగులు) మరోసారి కీలకం కానున్నాడు. ఈ సీజన్‌లో కొత్తగా కనిపిస్తున్న రియాన్ పరాగ్ 567 పరుగులతో జట్టు తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. టాపార్డర్ రాణిస్తే ఈ జట్టుకు తిరుగుండదు. ధ్రువ్ జురేల్ రాణించాల్సిన అవసరముంది. హెట్‌మైర్, రోవ్‌మెన్ పావెల్‌లు ఫినిషింగ్ రోల్‌లో అదరగొడుతున్నారు. రాజస్థాన్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. బౌల్ట్, సందీఫ్ శర్మ, ఆవేశ్ ఖాన్‌లతో తమ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌లు తమ స్పిన్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. ఐపీఎల్‌లో హైదరాబాద్, రాజస్థాన్‌లు ఇప్పటివరకు ముఖాముఖి గా 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్థాన్ తొమ్మిదిం టిలో నెగ్గింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌దే పైచేయి.






