పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ కొరత లేదు.
- రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.
- నిన్న డిమాండ్ కు మించి పెట్రోల్, డీజిల్ సరఫరా.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) ప్రకటించారు. సోమవారం నాడు డిమాండ్ ను మించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేశామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 29,939 లీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా చేయబడిందని వెల్లడించారు. సగటున రోజుకు 5,883 లీటర్ల పెట్రోల్, 7,348 లీటర్ల డీజిల్ కు డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.
అయితే సోమవారంనాడు, వాహనదారులకు 11,490 లీటర్ల పెట్రోల్, 18,449 లీటర్ల డీజిల్ సరఫరా చేశామని స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సరఫరాలపై పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ఎక్కువ కొని నిల్వ చేసుకోవద్దని పౌర సరఫరాల కమిషనర్ సూచించారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేదని పుకార్లు రావడంతో మూడ్రోజులుగా వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. నగరంలో పాటు జిల్లాల్లోని పలు బంకులు మూతపడగా, కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు.






