నేటి నుంచి తెలంగాణ దశాబ్ధి వేడుకలు
మెదక్, మే 31 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా దశాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలు పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే జూన్ 1వ తేదీన హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో జిల్లాకు సంబంధించి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావమై పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకల సభను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనుందని ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్య నాయకులు హాజరుకావాలని కోరారు. ఇదే రోజున హైదరాబాద్‌లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయంలో ముగింపు వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.






