సాగుకు అందుబాటులో విత్తనాలు
మెదక్, మే 31 (విజయక్రాంతి) : పక్కా ప్రణాళికతో సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం టేక్మాల్ మండల కేంద్రంలో 69.60 క్వింటాళ్ల జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. ఈసారి గత సంవత్సరం కంటే పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయని, గతంకంటే పది రోజుల ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
రైతులు సాగుకు సమాయత్తం అవుతున్న దృష్ట్యా విత్తనాల కొరత లేదని, సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. వానకాలం జిల్లాలో 3,73,509 ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. ఇందులో వరి పంట 3,27,113, పత్తి 40,619, మొక్కజొన్న 2,820, కంది 1125 ఎకరాలు, ఇతర పంటలు 1832 ఎకరాలలో సాగుకు ప్రణాళికలు వేశామన్నారు. ఈ మేరకు ప్రస్తుతం 32,088 ప్యాకెట్ల పత్తి విత్తనాలు డీలర్ల దుకాణాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాంప్రసాద్, టేక్మాల్ మండల వ్యవసాయాధికారి స్వప్న, విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శపాఠశాల పనుల తనిఖీలో భాగంగా టేక్మాల్ మండలం సాలోజిపల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న సంప్ నిర్మాణం, ఎలక్ట్రిసిటీ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మా ఆదర్శ పాఠశాలకు రెండో విడుత అడ్వాన్సుగాను 25శాతం నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 50శాతం విడుదల చేశామని, వాటి ద్వారా జూన్ 5వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. త్వరలో ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమంలో గ్రామంలోని బడి మానేసిన పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో నమోదు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, సెక్టోరియల్ ఆఫీసర్ సుదర్శన్‌మూర్తి, ఎంఈవో నీలకంఠం, బుచ్చయ్యనాయక్, డీఈ పంచాయతీరాజ్ శ్రీనివాస్, ఏఈ గోపాల్, ప్రధానోపాధ్యాయులరాలు రజిత పాల్గొన్నారు.






