calender_icon.png 7 February, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాధవరెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఎలా ఇస్తారు?

07-02-2026 12:24:02 AM

రిజర్వేషన్లపై కేసు వెనుక బీఆర్‌ఎస్ పార్టీ

12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ 

మరో మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసును బీఆర్‌ఎస్ వేయించిందా? బీసీల రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ వ్యతిరేకమా? అని నిలదీశారు. మాధవ్‌రెడ్డి అనే వ్యక్తి హరీశ్ రావు వర్గమని, ఆయన పర్సనల్ లాయర్ ఈ కేసు వేయించడంతో అప్పుడు దీని వెనుక ఉన్నది హరీశ్ మాత్రమే అని అనుకున్నానని, కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వటం కారణంగా దీని వెనుక పార్టీ మొత్తం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. 

శుక్రవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీల విషయంలో బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ మాధవ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి కోసం మేము కరీంనగర్‌లో భూపోరాటం చేశామని గుర్తు చేశారు. ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెడుతున్నామని, ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు హాజరుకా వాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రచారం యాక్టివ్‌గా లేదని, ఆ పార్టీ నేతలెవరూ కిందిస్థాయిలో క్రియాశీలకంగా లేరని అన్నారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని, అలా ప్రచారం చేయడం లేదంటే వారు రాష్ట్ర స్థాయి నాయకులు కాదా అని ఎద్దేవా చేశారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశముందని తెలిపారు.