09-06-2025 12:00:00 AM
ఊరు వాడ గూడెం నగరం
నగారై జే కొట్టిన నినాదం
ప్రజల ఉద్యమ ప్రతిరూపం
సామాజిక చైతన్యాల ధుని
తెలంగాణ తల్లి ప్రతిధ్వని
కరెంటుకోత కరువు రక్కసి
బతుకు ఎక్కిరించే
ఎగతాళి వార్తలు
ఆకలిచావులు ఆత్మహత్యలు
ఆగని దుక్కం
నీళ్లు పారె నేలన
నెత్తుటి వాగులు
కాగితాలు చించేసినట్లు
బతుకులను కుల్లబొడిచిండ్రు
ఆటాపాటలు-
మాటమంతులు
స్వేచ్ఛా వాయువులను ఉరితీసిండ్రు
ఊరిల ఉన్నమా?
వల్లకాడులో ఉన్నమా?
తెలియని దైన్యస్థితి
ఊరకనే పిడికిలెత్తలే
ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం
సబ్బండ కళల అమ్మరూపం
ఉద్యమ ఉదరం లోంచి
పేగులు కిందపడినా
ఆశయాన్ని అంబరాన్ని కెత్తినం
తెల్లారని ఒప్పందాలు
అవమానాల చీదరింపులు
వంచించిన ఆరు సూత్రాలు
కమిటీలు కమీషన్లు
కుట్రల కాలయాపనలు
తిరిగి తిరిగి మట్టికాళ్లకు పుండ్లు
అడిగి అడిగి అడ్రస్‌లు గల్లంతు
అధికార దాహం
కోస్తాంధ్ర నిరంకుష దమననీతి
ఆధిపత్య అరాచక పాలన విముక్తికై
ఎదురొడ్డి పోరాడినం
నలుగురున్న చోట
నాలుగు వీధులు కలిసేకాడ
నిప్పుల నెగడైన తెలంగాణ తల్లి
భాష యాసను బొందల పాలు చేసి
పొత్తిలి నిండా నిప్పులు
కడుపునిండా బాధెంతో
కొలిమికి తెలుసు
నాగలి చెమటలు రైతుకు తెలుసు
నీరడికి తెలుసు నీటి కష్టాలు
కాకులకేం తెలుసు కల్లం యాతన
ఆత్మగౌరవ పోరాటం
తెలంగాణ తల్లి కన్నీళ్లు
జానెడు పొట్టకోసం
పట్టపగలు పిట్టల్లా రాలిపోయినం
తుపాకి తూటాలకు బలైన
మాంసపు ముద్దలం
పుట్టిన తావున బతుకు లేదు
పర దేశంలో చీకటి
శవాల మూటలు
ఇంటింటా ధైన్యం
స్వతంత్ర పరిపాలన అస్తిత్వానికై
బరిగీసిన రణక్షేత్రం
తెలంగాణ ప్రజాసమరం
కవుల కలాలు
ప్రజల పాటల గళాలు
బడులు గుడులు ఉద్యమ హారతులై
తెలంగాణ తల్లి
బతుకమ్మ బోనమై నిలిచింది
పురుట్ల లేరు పెరుగుట్ల అసలే లేరు
నలుగుట్ల తుపాకితో
ఉద్యమ పానాలు తీసె ఉరుకులాట
ఏదో ఒకలా అవకాశం వచ్చింది
బతుకమ్మతో తెలంగాణ తల్లి
తల్లిని తల్లిలా చూడు
అమ్మను అమ్మలా ఉంచు
నదిని నక్కలా చేయకు
జై తెలంగాణ!
- వనపట్ల సుబ్బయ్య