09-06-2025 12:00:00 AM
డా.సి.నారాయణరెడ్డి 12న వర్ధంతి :
కాలం సాక్షి
చాపకింది చీమలకు
తెరమాటు దోమలకు
పట్టుచొక్కాలు తొడుక్కున్న పన్నాగాలకు
నీతిసూత్రాలు వడుకుతున్న పన్నాగాలకు
కళ్లు మూసుకుంటే చీకటి పడదు.
పుంజు గొంతుకు కీ ఇస్తే పొద్దు పొడవదు.
అప్పుడప్పుడు చీకటీ మెరుస్తుంది
ఆరుపు తెచ్చుకున్న మతాబాలతో.
అప్పుడప్పుడు ఆడిటోరియం అరుస్తుంది
కిరాయి చేతుల దరువు నోళ్లతో.
అంతటా పరచుకుంటుంది కాలం
సంచుల్ని తాల్చనప్పుడు
మనసుల్ని ఏమార్చినప్పుడు.
అది కోసుకు పోతుంటుంది
బండలు పేర్చుకొన్న స్థావరాల్లోకి.
పత్రికా విలేఖరులు చొరలేని
పరమ రహస్యాల్లోకి.
కాలం గమనిస్తుంటుంది
అడుసు తొక్కి కడుక్కోలేని కాళ్లను.
నీటితో జపమాలలు తిప్పి
చాటుగా వెక్కిరించే నొసళ్లను.
ఊరేగింపులకేం? ఉంటాయి
దేవుళ్లకే కాదు శవాలకూ.
ప్రకటనలకేం? పుడుతుంటాయి
సత్యం హత్య జరిగినప్పుడూ
ద్రోహం మోహరించినప్పుడూ.
పలికే పలుకు పుడుతున్నది
గుండె లోతునుంచా?
అవకాశవాదాన్ని అనువదించే
పెదవి అంచునుంచా?
కాలం నవ్వుకుంటుంది
తన వ్యక్తిగత రిజిస్టరులో చేర్చుకున్న
నానా ముఖాల్ని చూసి.
ఆ ముఖాల వెనకాల ప్రసవిస్తున్న
రకరకాల ఊసర వెల్లుల్ని చూసి.
రచనా కాలం: 1985
‘కాలం అంచుమీద’ సంకలనం నుంచి..
ఇంటర్నెట్ ఆర్కైవ్ సౌజన్యంతో..