30-07-2025 08:28:32 PM
మేడ్చల్ అర్బన్: శ్రీరంగవరం గ్రామం ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపజేస్తూ, గ్రామ కీలక దేవాలయాలైన ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, దుర్గమ్మ, మంగళమ్మ ఆలయాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ సర్పంచ్ విజయనందరెడ్డి, జెడ్పీటీసీ శైలజలు సంయుక్తంగా బుధవారం ఈ ఆలయాల స్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ ఆలయాల పునర్నిర్మాణం కోసం సుమారు 80 లక్షల రూపాయలను వెచ్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నిధులలో అధికభాగం మాజీ సర్పంచ్ విజయనందరెడ్డి, జెడ్పీటీసీ శైలజల సొంత ఖర్చుల నుండి మరికొంతమంది దాతల సహాయంతో సమకూర్చినట్లు పేర్కొన్నారు. గ్రామానికి ఒక నూతన శోభను తీసుకురావడంతో పాటు, భక్తులకు మరింత సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ పునర్నిర్మాణానికి తమ మద్దతును తెలియజేశారు.