జిహాద్ x వికాస్

10-05-2024 01:37:15 AM

బీజేపీకి పది సీట్లు పక్కా

రాహుల్ పిల్ల చేష్టలకు.. మోదీ గ్యారెంటీలకు మధ్య పోరు 

అసద్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధకులు

పదేండ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. రాష్ట్రాన్ని రేవంత్ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారు 

భువనగిరి ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా

యాదాద్రిభువనగిరి, మే 9 (విజయక్రాంతి): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దేశ వికాస్‌కు, జిహాద్‌కు మధ్య పోరాటమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్ బాబా (రాహుల్‌గాంధీ), నరేంద్రమోదీ మధ్య పోటీ అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ౧౦ ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి పది సీట్లు ఇస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరిలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ధ్వజమెత్తారు.  

ఇప్పటికే ౨౦౦ సీట్లు 

యావత్ దేశం మరోసారి మోదీ ప్రధాని కావాలని నినదిస్తోందని అమిత్ షా అన్నారు. గత మూడు దఫాలుగా జరిగిన పోలింగ్‌లో బీజేపీ 200 సీట్లకు చేరువయ్యిందని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీకి నాలుగు స్థానాలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. ఈసారి డబుల్ డిజిట్ అందించి 400 ఎంపీ సీట్ల లక్ష్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని, పోటీ చేయడానికి  అభ్యర్థులు కూడా దొరక్క గతంలో పార్టీ నుంచి సస్పెండైన తన చెంచా కాల్లుమొక్కి భువనగిరిలో అభ్యర్థిగా నిలబెట్టారని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలకు, ప్రధాని మోదీ గ్యారెంటీకి మధ్య  సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. రాహుల్‌గాంధీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు చెల్లుబాటు కాలేదని, మోదీ గ్యారెంటీ ఇస్తే తిరుగులేకుండా అమలు జరిగి తీరుతాయని అన్నారు. ‘రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతుబంధు వస్తున్నదా? కూలీలకు ఏడాదికి రూ.12 వేలు వస్తున్నాయా? వరి, గోధుమలకు రూ.500 బోనస్ ఎక్కడపోయింది? విద్యార్థులకు పూచీకత్తు లేని రూ.5 లక్షల రుణం ఎందుకు అమలు కావడం లేదు? విద్యార్థ్ధినిలకు స్కూటీలు ఎందుకు అందించడం లేదు? అని ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిరం సమస్యను కాంగ్రెస్ దశాబ్దాలుగా నాన్చితే.. తాము పదేండ్లలోనే సమస్యలన్నీ పరిష్కరించి ఆలయాన్ని నిర్మించి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిపామని తెలిపారు. 

నక్సలైట్లను రూపుమాపాం

రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్ గురించి ఏం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అంటున్నారని అమిత్ షా విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందని అన్నారు. దేశంలో తీవ్రవాదాన్ని అణచివేశామని, నక్సలైట్లను రూపుమాపామని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. ఒవైసీలకు భయపడి శ్రీరామ నవమి శోభాయాత్రలపై కూడా ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు.

మైనార్టీలకు మతపరమైన రిజర్వేషన్లు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి అన్యాయం చేసిందని విమర్శించారు. చారిత్రక భువనగిరి చ్‌వనగిరి అభివృద్ధికి రూ.140 కోట్లు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయని తెలిపారు. జనగామ, భువనగిరి రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వేస్టేషన్ నిర్మాణం, భువనగిరి వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం, సూర్యాపేట సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు.

భువనగిరి ఓటర్లు విజ్ఞతతో ఓటువేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, పార్టీ నేతలు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పడాల శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి, కడియం రామచంద్రయ్య, ఆరుట్ల దశమంతరెడ్డి, తాదూరి శ్రీనివాస్, సంకినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

* రాహుల్‌గాంధీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు చెల్లుబాటు కాలేదు.  రైతులకు ఎకరానికి రూ. 15 వేల రైతుబంధు వస్తున్నదా? కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు వస్తున్నాయా? వరి, గోధుమలకు రూ. 500 బోనస్ ఎక్కడపోయింది? విద్యార్థులకు పూచీకత్తు లేని రూ. 5 లక్షల రుణం ఎందుకు అమలు కావడం లేదు? విద్యార్థ్ధినిలకు స్కూటీలు ఎందుకు అందించడం లేదు? 

 అమిత్ షా