28 August, 2026 | 5:16 PM

వివాదాల సుడిగుండంలో ఎస్‌యూ

21-05-2024 02:05 AM

నేటితో ముగియనున్న వీసీ మల్లేశం పదవీ కాలం

చివరి రోజూ కొనసాగిన నిరసన

కరీంనగర్, మే 20 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(ఎస్‌యూ) వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకం నుంచి పలు అంశాల్లో అవినీతి మరకలు అంటుకున్నాయి. ప్రస్తుతం వీసీగా పనిచేస్తున్న మల్లేశం పదవీ కాలం నేటి(మంగళవారం)తో ముగియనుంది. అయితే మల్లేశం జారీ చేసిన జీవో నంబర్ 1222లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరపాలని సోమవారం బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఏర్పడిన మరుసటి సంవత్సరం 2009 నుంచి పలు విభాగాల్లో బోధనేతర సిబ్బంది 37 మంది పనిచేస్తున్నారు.

2013లో యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టల్స్‌ను కాంట్రాక్టు కు ఇచ్చి బోధనేతర సిబ్బందిని 59కి పెంచా రు. వీసీ మల్లేశం బోధనేతర సిబ్బందికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పిస్తామని 2023లో జీవో 1222ను తీసుకువచ్చారు. పాత సిబ్బందిని కలిపి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించా రు. ఇందులో విద్యార్హత, సీనియార్టీ ఉన్నవారిని పక్కనపెట్టి ప్రభుత్వ సిఫారసుతో 2022లో నియమించిన ఉద్యోగులను ఈ జీవోతో కలిపి డేటాఎంట్రీ ఆపరేటర్‌గా ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదమైంది.

జీవోతో యూనివర్సిటీ క్యాంపస్‌లో పనిచేస్తున్న వారితో పాటు గోదావరిఖని పీజీ క్యాంపస్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీంతో వీసీ మల్లేశం పదవీ బాధ్యతలు ముగియనున్న ఒకరోజు ముందు బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.