పంట నష్టం.. రైతు విచారం
జయశంకర్ జిల్లాలో 1,280 ఎకరాల్లో వరి పైరు నేలమట్టం
భద్రాద్రి జిల్లాలో 89.50 ఎకరాల్లో ఉద్యాన పంటలు
జయశంకర్ భూపాలపల్లి /భద్రాద్రి కొత్తగూడెం, మే 9 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి మర్నాడు ఉదయం వరకు గాలిదుమారంతో కురిసిన అకాల వర్షానికి జిల్లావ్యాప్తంగా 1,280 ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. కల్లాలు, కేంద్రాల వద్ద సుమారు 300 బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టంపై అంచనాలు సిద్ధం ప్రభుత్వానికి నివేదించారు. రైతులు అధైర్యపడొద్దని, తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు. మరోవైపు వర్షం కారణంగా చేతికొచ్చిన వరి పంటలో 60శాతం గింజలు నేల రాలాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కోతకు వచ్చిన పంటను కోత యంత్రంతో కోయించాలంటే ఎకరానికి సుమారు గంట సమయం పడుతుందని, అందుకు సుమారు రూ.2,200 వరకు ఖర్చవుతుందని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం పొలంలో వర్షపు నీరు చేరడంతో నీరు పూర్తిగా ఇంకే వరకు ఎదురుచూడాలని, ఆ తర్వాత కోత కోయాలం టున్నారు. కోతలకు ఎక్కువ సమయం పడుతుందని, దీంతో కోతయంత్రానికి కిరాయి గంటకు రూ.3,200 నుంచి రూ.3,500 వరకు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. అలాగే వానల ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.50 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపహాడ్ మండలాలకు చెందిన 43 మంది రైతులు పెంచుతున్న అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. జిల్లా ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనా వేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.18 వేల చొప్పున పరిహారం అందేలా చూస్తామని ఆయన తెలిపారు.






