డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
- మక్తల్ అభ్యర్థి ఆత్మహత్యపై భగ్గుమన్న బీజేపీ
- డీజీపీ కార్యాలయం ముట్టడి.. పోలీసులతో తోపులాట
- కాంగ్రెస్ వేధింపుల వల్లే చనిపోయాడంటూ ఆందోళన
- తోపులాటలో కిందపడ్డ ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటన రాష్ట్ర రాజధానిలో సెగ రేపింది. ఈ ఘటనకు అధికార కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ బీజేపీ శ్రేణులు మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి రణరంగంగా మారింది.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. గేటు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆం దోళనకారులను నియంత్రించే క్రమంలో జరిగిన గందరగోళంలో డీసీపీ శిల్పవల్లి కింద పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను లేపి, ఆందోళనకారులను పక్కకు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేకే తమ అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేస్తోందని మండిపడ్డారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.




