పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?
కట్కూరు గ్రామపంచాయతీలో మాజీ-ప్రస్తుత సర్పంచ్‌ల మధ్య ఉద్రిక్తత
హుస్నాబాద్/అక్కన్నపేట: అక్కన్నపేట మండలంలోని కట్కూరు గ్రామపంచాయతీలో పాత బిల్లుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి తరచుగా గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఒత్తిడి తెస్తున్నారని ప్రస్తుత సర్పంచ్ కొడముంజ బాలరాజు ఆరోపించారు. పాలకవర్గం తీర్మానం మేరకు ఇప్పటికే రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించినప్పటికీ, ఇంకా బకాయిలు ఇవ్వాలని మాజీ సర్పంచ్ తరచూ ఒత్తిడి చేస్తూ గ్రామ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఇకపై సరైన ఎంబీ రికార్డులు, సాంకేతిక ఆధారాలు ఉన్న బిల్లులకే చెల్లింపులు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీ పనుల్లో అనవసర జోక్యం చేసుకుంటూ వేధింపులకు పాల్పడుతున్న మాజీ సర్పంచ్‌పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు.






