12-02-2026 02:45:29 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా పాల్వంచలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఖాళీ బ్యాలెట్ బాక్సును పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో సీపీఐ నేతలు ఆగ్రహంతో స్టేషన్‌ను ముట్టడించారు. పాల్వం చ సీఐ వ్యవహారంతో వందలాదిగా సీపీఐ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకొని బుధవా రం రాత్రి ధర్నాకు దిగారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతో అధికార పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని, పోలీస్ యం త్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐ దాని మిత్రపక్షాల అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థులను ఓడించేందుకు పోలీసు యంత్రంగాన్ని అధికా ర పార్టీ నాయకులు ఉపయోగించారని ఆరోపించారు.
పోలింగ్ కేంద్రాలకు అధికార పార్టీ వారిని ఏమి ప్రశ్నించకుండా వదిలివేయడం, సీపీఐ అభ్యర్థులను నిలిపివేయడం చేశారని ఆరోపించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎన్నికల నిర్వహణ లో అధికార యంత్రం పూర్తిగా వైఫల్యం చెం దిందని ధ్వజమెత్తారు.
పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లాల్సిన పోలింగ్ బాక్స్ పోలీస్ స్టేషన్‌కు రావడంపై అనేక అనుమానాలను వారు వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు దొంగ ఓట్లు వేసుకునేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. పాత పాల్వంచ పోలింగ్ స్టేషన్లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళను గంటలు తరబడి పోలీస్టేషన్‌లో ఉంచటాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
సిబ్బంది బాక్స్ మర్చిపోయారు: డీఎస్పీ సతీష్ కుమార్
పాత పాల్వంచ 47వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూంకు వెళ్లాల్సిన ఖాళీ బ్యాలెట్ బాక్స్‌ను సిబ్బంది మర్చిపోయారని, బాక్సులు తరలించిన అనంతరం కాళీ బాక్స్‌ను గుర్తించి స్టేషన్‌కు తీసుకు వచ్చారని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. అధికార పార్టీకి పోలీస్ యంత్రాంగం సహకరించారు అనే ఆరోపణను ఆయన ఖండించారు.