సిద్దాపూర్లో ఉద్రిక్తత
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన, నేతల అరెస్ట్
షాద్‌నగర్, జూలై 10: సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలతో షాద్ నగర్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించేందుకు స్వచ్ఛందంగా తరలివెళ్తున్న మహిళలను, వారికి మద్దతుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వడ్డే బాలయ్య, మహేందర్ రెడ్డి తదితరులను కొత్తూరు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
మరోవైపు, డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో వై ఎం తాండ, పులిచెర్లకుంట తండాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక యువతకు ఐటీ పరిశ్రమలు ఇచ్చి ఉపాధి కల్పించాల్సింది పోయి, జీవో నెం. 641 ద్వారా డంపింగ్ యార్డ్ తెచ్చి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఊరు, వాడ ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో పలువురు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






