నేడు టెన్త్ ఫలితాలు
విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు
వాట్సాప్‌లో 8096958096 నంబర్‌తో సెల్‌ఫోన్‌లోనే ఫలితాలు
పరీక్ష రాసిన 5.15 లక్షల మంది విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి మంగళవారం అధికారిక ప్రకటన విడుదలచేశారు. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23తో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మే మొదటి వా ంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందు నుంచి ప్రకటించినా.. తాజాగా బుధవారం విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఫలితాలను ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ సేవా వాట్సాప్ 80969 58096 నంబర్ ద్వారా సెల్ ఫోన్‌లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.






