ముచ్చటగా మూడోసారి మై.. నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పట్టాభిషేకం
మోదీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
ప్రధానితోపాటు 72 మంది మంత్రుల ప్రమాణం
తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్‌రెడ్డికి బెర్తులు
ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెమ్మసాని,
బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు
30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర మంత్రులు
36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు
ఎన్డీయే మిత్రపక్షాల నుంచి 11 మందికి చోటు
కొత్తగా క్యాబినెట్‌లోకి 11 మంది నేతలు
అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం
తరలివచ్చిన సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలు
కొలువుదీరిన వివిధ దేశాల రాయబారులు
ఉపరాష్ట్రపతి, సీజేఐ, ఎన్డీయే నేతల తళుకులు
సినీ, వ్యాపార ప్రముఖులతోపాటు సామాన్యులకూ ఆహ్వానం
రాష్టపతి భవన్ ముందు వేడుకలా కార్యక్రమం
న్యూఢిల్లీ, జూన్ 9: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్ ముందు దేశ, విదేశీ ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో వేడుకలా జరిగిన కార్యక్రమంలో నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకరించారు. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు రెండుగంటలపాటు సాగింది.
మొదట మోదీ చేత ప్రధానిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర సహాయ మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకరించారు. ప్రధానితో కలిపి మొత్తం 72 మంది ప్రమాణం చేశారు. వీరిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదాగల సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఈసారి మోదీ క్యాబినెట్‌లో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది.
ఓబీసీలకు పెద్దపీట
మంత్రివర్గంలో ఈసారి ఓబీసీలే ఎక్కువగా ఉన్నారు. ౨౫ మంది జనరల్, ౨౭ మంది ఓబీసీ, పది మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ, ఐదుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ నేతలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్‌లో బెర్తు దక్కింది. మొత్తంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన 11 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు.
వీరిలో జేడీఎస్ నేత కుమారస్వామి, రాష్ట్రీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదరి, లోక్‌జన శక్తి నేత చిరాగ్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రాం మాంఝీ తదితరులు ఉన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రు లు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌కు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది. ఈసారి ఈశాన్య రాష్ట్రాల నుంచి కిరెన్ రిజిజుతోపాటు సర్బానంద సోనోవాల్ కూడా కేంద్ర మంత్రి అయ్యారు. ఊహించిన ట్టుగా అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ తదితర బీజేపీ ప్రముఖులంతా మళ్లీ కేంద్ర క్యాబినెట్‌లో కొలువుదీరారు.
కేరళలో బీజేపీ ఖాతా తెరిచిన ప్రముఖ మలయాళ సినీ హీరో సురేశ్‌గోపీకి మోదీ క్యాబినెట్‌లో చోటు లభించింది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలు, వివిధ దేశాల రాయబారులు, భారత రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపికచేసిన ట్రాన్స్ జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకొన్న 90 మంది కార్మికులతోపాటు పలువురు శానిటేషన్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో దాదాపు 10 వేలమంది పోలీస్, ట్రాఫిక్, ఎన్‌ఎస్జీ బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ గగనతలాన్ని మూసివేశారు.
34 మంది మంత్రులకు గతంలో కేంద్రమంత్రి లేదా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసినవారు 23 మంది.
మంత్రుల పార్టీలు పార్టీ సంఖ్య
బీజేపీ 60
టీడీపీ 2
జేడీయూ 2
జేడీఎస్ 1
శివసేన 1
ఎల్‌జేపీ 1
ఆర్‌ఎల్‌డీ 1
ఆర్పీయూ 1
ఆప్నాదళ్ 1
హెచ్‌ఏఎం 1
మహిళా మంత్రులు
1. నిర్మలాసీతారామన్
2. అన్నపూర్ణాదేవి
3.అనుప్రియ పటేల్
4. శోభ కరంద్లాజే
5. నిముబెన్ బాంభారియా
౬. సావిత్రి ఠాకూర్
సామాజికవర్గాల వారీగా..
ఓబీసీ 27
ఎస్సీ 10
ఎస్టీ 5
మైనార్టీ 5
జనరల్ 25






