20 June, 2026 | 2:37 AM

నైజర్ విమానాశ్రయంపై ఉగ్రదాడి

20-06-2026 12:14 AM
  1. మొత్తం 35 మంది మృతి
  2. మృతుల్లో 11 మంది సైనికులు, ఇద్దరు పౌరులు
  3.    22 మంది ఉగ్రవాదులు హతం.. 20 మంది అరెస్ట్

డాకర్ (సెనెగల్), జూన్ 18: నైజర్ రాజధాని నియామీలోని ప్రధాన విమానాశ్ర యంపై, సైనిక, వైమానిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో 11 మంది సైనికులు, ఇద్దరు పౌరులు దుర్మరణం చెందా రు. 22 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారని అధికారులు తెలిపారు. నియామీ లో జరిగిన ఈ దాడిని అడ్డుకున్నామని, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా 20 మంది అనుమానితులను అరెస్టు చేశామని నైజర్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి విమాన రాకపోకలను పునరుద్ధరించినట్లు నైజర్ పౌర విమానానయాన సంస్థ వివరించింది. దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం) ప్రకటించింది. కాగా దాడి రెండు గంటలపాటు కొనసాగింది. ఈ ఏడాదిలో ఈ విమానాశ్రయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసి, రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు.

2023లో జరిగిన సైనిక తిరుగుబాటు (కూప్) తర్వాత సైనిక పాలనలో ఉన్న నైజర్, ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో చెలరేగుతున్న ప్రాణాంతక జిహాదీ హింసను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పొరుగు దేశాలైన బుర్కినా ఫాసో, మాలి కూడా సైనిక పాలనలోనే ఉన్నాయి. నైజర్ సైనిక ప్రభుత్వానికి అధిపతిగా అబ్దురహమాన్ టియాని వ్యవహరిస్తున్నారు. గత మూడేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. అయినా ఉగ్రవాద దాడులను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.