03-10-2025 02:34:37 PM
అమరావతి: తిరుపతి జిల్లాలో బాంబు బెదిరింపు(Terrorist Bomb Threats) మెయిల్స్ కలకలం రేగింది. తిరుమల తిరుపతి(Tirupati) దేవస్థానంలో బాంబులు పేల్చబోతున్నారని ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రెండు అనుమానాస్పద మెయిల్స్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తిరువళ్లూర్ కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కుట్రగా మెయిల్ బెదిరింపులు వచ్చాయి.
తిరుపతిలోని 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు(RDX explosion) పదార్థాలను పేల్చబోతున్నట్లు దుండగులు బెదిరించారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన దృష్ట్యా వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లను టార్గెట్ చేసి 2 ఆర్డీఎక్స్ దాచినట్టు మెయిల్‌లో హెచ్చరిక వచ్చినట్లు సమాచారం. తిరువళ్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపుదిద్దుకున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.