15-11-2025 12:00:53 AM
-డిసెంబర్ 27 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
-ఇన్‌సర్వీస్ టీచర్లకు డీఎడ్, బీఎడ్‌తో సంబంధం లేకున్నా పరీక్షకు అవకాశం
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) దరఖాస్తులు శనివారం నుంచి స్వీకరించనున్నారు. శుక్రవారం టెట్ నోటిఫికేషన్, టెట్ ఇన్ఫర్మేషన్ బులిటన్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 15 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వరకు హెల్ప్ డెస్క్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
డిసెంబర్ 27 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకో వాలని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు సెషన్1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యన ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ నోటిఫికేషన్‌లో తెలిపారు.
పేపర్ 1,2.. 150 మార్కులకు గానూ జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీ 50 శాతం, ఎస్సీఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో అర్హత సాధించాల్సి ఉంటుంది. సిలబస్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెట్ రాయాల్సి ఉంటుంది. అయితే ఇన్‌సర్వీస్ టీచర్లకు డీఎడ్, బీఎడ్ లేనివారు ఎస్జీటీ టీచర్లు పేపర్1, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు పేపర్2 రాసేందుకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ఒక పేపర్ రాయాలంటే రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి చెల్లించాలి.