calender_icon.png 13 February, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి మజిలీకి చోటేది?

13-02-2026 12:02:02 AM

ఏండ్ల తరబడి తీరని రాజపేట తండా వాసుల సమస్య

సొంతూరు విడిచి పోరుగూరులో దహన సంస్కారాలు

స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని తండావాసుల వేడుకోలు

మర్రిగూడ, ఫిబ్రవరి 12 : గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో ఎవరైనా చనిపోతే ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదని లక్ష్యంతో ప్రతి గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటు చేసింది. అయితే కొన్ని గ్రామాలలో స్థానికంగా నెలకొన్న సమస్యలతో అక్కడ స్మశాన వాటికలు ఏర్పాటు చేయలేదు. ఇది ఆ గ్రామ వాసులకు శాపాలుగా మారి సంవత్సరాల తరబడి సమస్య అలానే మిగిలిపోవడంతో చివరి మజిలీకి చోటు లేక అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

సంవత్సరాల తరబడి తీరని సమస్య

ప్రభుత్వాలు మారినా గిరిజనతండా వాసుల దుస్థితి మాత్రం మారడం లేదు. సంత్సరాల తరబడి దహన సంస్కారాలకు చోటు లేకపోవడంతో ఆ తండా వాసులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేసేందుకు పొరుగూరు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి మండలంలోని రాజపేట తండాలో నెలకుంది. మండలంలో ప్రతి గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణము ఉన్నప్పటికీ రాజపేట తండాలో రెండు చోట్ల పిల్లర్స్ పోసిన తర్వాత గ్రామములో చోటు చేసుకున్న దుష్పరిణామాల మధ్య నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

సర్వే నెంబర్ 288 లో 35 ఎకరాలు 36 గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 16 ఎకరాల పైగా ప్రభుత్వ పట్టాలు కలిగినప్పటికీ మరో 20 ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నట్లు గ్రామస్తుల ద్వారా పూర్తి సమగ్ర సమాచారం. అయితే కాలం చేసిన వ్యక్తి చివరి మజిలీ కోసం మాత్రం సొంత ఊరు ను వదిలి పొరుగురు వట్టిపల్లి, మర్రిగూడ స్మశాన వాటికలలో దహన సంస్కారాలకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూన్నారంటూ తండావాసు లు ఆరోపిస్తున్నారు.

ప్రజా సౌకర్యాలను కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు  విఫలమయ్యారని గ్రామంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం గమనార్హం.  ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలోనైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో స్మశాన వాటికను నిర్మించి గ్రామస్తుల కొరతను తీర్చాలని రాజపేట తండా వాసులు కోరుతున్నారు.            

సమస్యను తొలగించాలి

మా తండాలో స్మశాన వాటిక లేకపోవడంతో సంవత్సరాల తరబడి తండాలో ఎవరైనా చనిపోతే పక్కనున్న ఊర్లోకి తీసుకువెళ్లి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ గ్రామంలోనూ ఇటువంటి సమస్య లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మా తండాలో స్మశాన వాటికను ఏర్పాటు చేసి సమస్యను తొలగించాలి.

రమావత్ నరేష్ నాయక్,

రాజపేటతండ వాసి