calender_icon.png 17 July, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది మా భూమే!

17-07-2025 12:55:43 AM

-గచ్చిబౌలి గౌలిదొడ్డిలో భూ కబ్జా యత్నాలపై టీఎన్జీవోల నిరసన

-మా స్థలాన్ని మాకే తిరిగి అప్పగించాలి

-టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్

శేరిలింగంపల్లి, జూలై 16 : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్.. టీఎన్జీవో మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తమకు కేటాయించిన స్థలంలోకి ‘వినాయక సొసైటీ’ పేరుతో కొందరు ప్రవేశిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.

తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని  ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారు? అం టూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. ఈ భూ కబ్జాపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షలకు దిగుతామంటూ వారు హెచ్చరించారు.

అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. గతంలో తమ సొసైటీకి సర్వే నెంబర్ 36, 37లో 140 ఎకరాల 1 1 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి, రిజిస్ట్రేషన్ కూడా చేసిందని తెలిపారు. ఆ భూమి లేఅవుట్ కోసం దాదాపు 18 కోట్లు కూడా ఖర్చు చేశామన్నారు. వినాయక సొసైటీ పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కావాలని తమ భూమిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

తమ స్థలాలను తమకు ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రులకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్లతో కొందరు కబ్జాలకు ప్రయత్నిస్తున్నారన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండానే ఆ భూమిని ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. తమ ఉద్యోగులను తమ పైకే ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.

ఆ భూమి పూర్తిగా తమ అధీనంలో వున్నప్పుడు, వారికి ఆ భూమిపై హక్కులు ఎలా వచ్చాయో కలెక్టర్ చెప్పాలని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రెసిడెంట్ జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీఎన్జీవో సొసైటీ ప్రెసిడెంట్ బీ సత్యనారాయణ గౌడ్, టీఎన్జీవో సొసైటీ సెక్రటరీ బీ మల్లారెడ్డి, అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.