17-07-2025 12:55:47 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూలై ౧౬ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవ లు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు.
బుధవారం నిర్మల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటైన చిన్న పిల్లల వైద్య విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఔట్ పేషెంట్ వార్డుల్లో చికిత్స కోసం వచ్చి న ప్రజలతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాలానుగుణ వ్యాధుల కారణంగా రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రోజువారీగా ఓపీ కేసుల వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఇన్పేషెంట్ వార్డును సందర్శించిన కలెక్టర్, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో వైద్యం అందించడం జరుగుతుందని భరోసా కల్పించారు. అనంతరం ల్యాబొరేటరీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, అందుబాటులో ఉన్న పరీక్షల వివరాలు తెలుసుకుని, అవసరమైన అన్ని రోగ నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రిలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకుముందు జీడియాట్రిక్ వార్డును పరిశీలించిన కలెక్టర్, వృద్ధులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అవసరమైతే అదనపు సిబ్బంది నియమించి, పరిశుభ్రత, ఔషధాల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, అవుట్పోస్ట్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ఏర్పాట్లను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో ఆసుపత్రి పర్యవేక్షకుడు గోపా ల్ సింగ్, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.