27 April, 2026 | 7:55 AM

దిశాపటానీ ఇంటి ఎదుట కాల్పులు జరిపిన నిందితులు హతం

18-09-2025 12:47 AM

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు ధ్రువీకరించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: బరేలీలోని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతం అయినట్టు బుధవారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్టు గుర్తించిన యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల బృందం వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో నిందితులిద్దరికీ గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, సోనిపట్‌కు చెందిన అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు కూడా రోహిత్ గోదారా బ్రార్ ముఠాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి తుపాకులు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.