మాకు న్యాయం చేయండి
ట్రిపుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన
నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవోకు వినతి
జగదేవపూర్, ఆగస్టు 14: ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం తమ భూములను తీసుకుంటున్న అధికారులు న్యాయం చేయాలని ఇటిక్యాల గ్రామానికి చెందిన బాధిత రైతులు వేడుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్గ్రేషియా చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 272లో మొత్తం 209 ఎకరాల 33 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి సుమారు 39 ఎకరాల భూమి అవసరమవుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నట్లు రైతులు తెలిపారు.
గతంలో భూమిలేని రైతులకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించినట్లు వారు పేర్కొన్నారు. అయితే తమకు భూమి హద్దులు సక్రమంగా చూపించకపోవడంతో భూమి మొత్తం రాళ్లు, గుట్టలతో ఉండేదని, కొందరు రైతులు సాగు చేసుకోగా, మరికొందరు పశువులను మేపుకునేవారని చెప్పారు. హద్దులు తెలియక సాగు చేసుకోలేకపోయిన రైతులు కూడా ఉన్నారని వివరించారు.
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ రోడ్డు కోసం భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా కొందరు రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. తమ భూములు కోల్పోతున్నందున న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి చూపించాలని బాధిత రైతులు కోరారు.
ఈ మేరకు సర్పంచ్ దీనా రాజలింగం ఆధ్వర్యంలో బాధిత రైతులు స్థానిక తహసీల్దార్తో పాటు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళకు వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్,బాధిత రైతులు మల్లేష్, కనుకయ్య, అశోక్ తదితరులు ఉన్నారు.ఈ విషయంపై ‘విజయక్రాంతి’ ప్రతినిధి ఆర్డీవో చంద్రకళను వివరణ కోరగా, రైతులు సమర్పించిన వినతిపత్రంపై జిల్లా కలెక్టర్కు సమాచారం అందించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






