6 May, 2026 | 1:21 AM

ఆ ముగ్గురికి ఆ మూడు సంఘాల అండ..?

06-05-2026 12:14 AM
  1. కార్మికుల పాలిట యామకింకర్లూ...
  2. శాంతిఖనిలో పెట్రేగిన అధికారుల ఆగడాలు... 
  3. అధికారుల తప్పిదాలకు కార్మికులకు శిక్షలు...
  4. అధికారులకు గొడుగు పడుతున్న సంఘాలు 
  5. ముందుకు సాగని ఉత్పత్తి ప్రక్రియ 
  6. ప్రేక్షక పాత్రలో ఉన్నతాధికారులు 

బెల్లంపల్లి, మే 5 : రజాకార్ల జులుంను ఆ గని అధికారులు మరిపిస్తున్నారు. అక్కడ వారిదే ఇష్టారాజ్యం.. ఆడిందే ఆట పాడిందే పాట... అధికారులంటే.. ఆ ముగ్గురే... శాంతిఖనిలో లాంగ్ స్టాండింగ్ గా ఉంటున్నారు. సింగరేణి ఉన్నతాధికారులు, ఆ మూడు ప్రధాన కార్మిక సంఘాల లీడర్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వారి దూకుడుకు అడ్డూ అదుపు ఉండదు. ఇంతగా చలాయించుకుంటున్న ఆ ముగ్గురు అధికారులు పనిచేస్తున్నదెక్కడో కాదు.. శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టులోనే... కర్త, కర్మ, క్రియ వహించేది వారే... రా.. వ..ము.. అనే ఈ ముగ్గురు శాంతిఖని బాసులుగా చాలామణీ అవుతున్నారు.

కార్మికులపై అమానుషంగా వ్యవహరిస్తున్న ఆ ముగ్గురికి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజికేఎస్ ప్రధాన సంఘాల స్థానిక, పెద్ద లీడర్లు గొడుగు పడుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి.. కార్మికులకు అండగా ఉండి, హక్కుల కోసం, పీడక అధికారులపై తిరగబడాలిసినా ఆ సంఘాల లీడర్లు కసాయి అధికారుల పంచాన చేరిపోయారన్న ఆరోపణలు కార్మికులు వ్యక్తం చేస్తున్నారు.

కార్మికు లకన్నా, తమ స్వార్థ ప్రయోజనాలు, ముఖ్యంగా అధికారుల చెలిమికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలను లీడర్లు మూటకట్టుకున్నారు. సర్ఫేజ్ పనులకు కక్కుర్తి పడి అధికారుల ఆగడాలపై స్పందించడంలేదన్న విమర్శలకు గురవుతున్నారు. గనిలో అధికారులు ఏమి చేసినా చూసి కూడా మౌనంగా ఉండటమే వారి పరమావధిగా ఆ మూడు సంఘాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కార్మికులను అనునిత్యం అష్టకష్టాలు పెడుతూవుంటే, కార్మిక సంఘాల లీడర్లు ఇప్పటివరకూ అధికారులపై పల్లెత్తు మాట అన్నపాపాన పోలేదు. అధికారులతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఆ సంఘాల పట్ల కార్మికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కార్మికుల పక్షం నుంచి పూర్తిగా దూరమవు తున్నారు. కార్మికులు లీడర్లను విశ్వసించడం లేదు. అధికారుల పదఘట్టం కార్మికులు నలిగిపోతున్నారు. అధికారులు ఇలా రెచ్చిపోవ డానికి కార్మిక సంఘాల లీడర్ల తోడ్పాటే కీలకమని విశ్లేషకులు అంటున్నారు.

- యమకింకర్లు ఆ ముగ్గురు..?

చాలా కాలంగా శాంతిఖనిలోనే తిష్ట వేసిన ఆ ముగ్గురు అధికారులు కార్మికులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. కార్మికుల పాలిట యమ కింకరులుగా మారిపోయారని విశ్లేషకులు అంటు న్నారు. గనిలో కనీస సదుపాయాలు కల్పించరూ. గాలి, నీరు, రక్షణ వంటి మౌలిక సౌకర్యాలు అస్సలు ఉండవు. ఫలితంగా గనిలో నిత్యం చిన్నాపెద్ద ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. గాలి అందక ఊపిరాడక ఎంతో మంది కార్మికులు పని స్థలాల్లో స్పృహ తప్పి పడి పోయిన సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

ప్రమాదాలు జరిగితే రిపోర్ట్ నమోదు చెయ్యరు. రిపోర్టు నమోదు కోసం ఎవరైనా అడిగితే బెదిరింపులు తప్పవవు. కార్మికుల వ్యక్తిగత నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరిగినట్టు బలవంతంగా రాయించుకుంటారు. అంతటితో సరిపెట్టుకోరు. ప్రమాదాలకు బాధ్యులు చేస్తూ కార్మికులనే సస్పెండ్లు చేస్తారు. ఇలాంటి సంఘటనలు శాంతిఖనిలో కోకొల్లలు. అందుకు ఇటీవల శాంతిఖని లో షిఫ్టు మార్చి వేసి అధికారుల వేధింపులను తట్టుకోలేక మాధవ్ అనే కార్మికుడు ఒంటిపై పిట్లోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాచేయడం తప్పని ఆ కార్మికుడి తోనే సంజాయిషీ రాయించుకున్నారు.

క్షణికావేశంలో అలా చేశానని సంజాయిషీ ప్రక టన వెనుక ఆ ముగ్గురి అధికారుల బెదిరింపులు లేకుండా అలా జరగదనీ కార్మికులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే గని ప్రమాదంలో గాయపడిన కార్మికులను సస్పెండ్ చేసిన ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. బాధిత కార్మికులతోనే తమదే తప్పుని రాయించుకోవడం పరిపాటుగా మారింది. గనిలో ప్రమాదాలను కప్పిపుచ్చడం కోసం, తమ తప్పులను కార్మికులపై నెట్టివేయడం అధికారులు ఒక విధానంగా అమలు చేస్తున్నారు.

- అధికారుల తప్పిదాలకు కార్మికులకు శిక్షలు..

శాంతిఖనిలో మునుపెన్నడూ లేని విధంగా కార్మికుల పై పనిభారం, పనిఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జరుగుతోన్న అధికారుల తప్పిదాలకు కార్మికులను బలిపశువులను చేస్తున్నారు. గనిలో రక్షణ చర్యలు శూన్యం. రక్షణలేని ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి అధికారులు బాధ్యత వహించాలి. అందుకోసం ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాకాకుండా ప్రమాదాలకు కార్మికులనే కారకులను చేస్తున్నారు.

గని ప్రమాదాలకు రక్షణాదికారి కారకుడు. గాయపడిన కార్మికుడిని బాధ్యునీగా చిత్రీకరించి చార్జిషీట్లు, సస్పెడ్లు చేయడం ఆ ముగ్గురు అధికారులకు చెల్లుబాటవుతున్నది. అధికారుల తీరుపై ఇదెక్కడి న్యాయమని కార్మికు లు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో కార్మికుల కోసం మాట్లాడే నాధుడే కరువయ్యాడు. పని భారం, గాలి, నీరు, రక్షణ పై మాట్లాడే వారే కంటికి కరువయ్యారునీ కార్మికులు వాపోతున్నారు. ఎవరు మాట్లాడినా మాట్లాడక పోయినా గనిలో సౌకర్యాలు కల్పించడం అధికారుల కనీస బాధత్య. ఈ మౌలిక బాధ్యతలకు అధికారులు ఏనాడో తిలోదకాలిస్తూ, కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు గనిలో వెల్లువెత్తుతున్నాయి. 

పంపు డ్రైవర్లపై వేధింపులు..

గనిలో ఫిట్టర్లు, పంపు డ్రైవర్ల విధులు అత్యంత ప్రధానమైనవి. ఎప్పుడూలేని విధంగా వారిని వేధింపులకు పాల్పడుతున్నారు. మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్న పంపు డ్రైవర్, సెకండ్ షిఫ్ట్ పంపు డ్రైవర్ డ్యూటీకి వచ్చేవరకు గనిలోనే ఉండాలని కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. ప్లే డే విధులు కు వచ్చే కార్మికులకు మ్యాన్ రైడింగ్ వినియోగించరాదని షరతు విధించారు. గనిలోకి నడుచుకుంటూ వెళ్ళాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదా ఎలక్ట్రిషన్తో మ్యాన్ రైడింగ్ ను వినిగించుకోవాలని కార్మికులను వేధిస్తున్నారనీ తెలుస్తోంది. ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఎవరూ నోరు మెదపడంపై కార్మికులు మండిపడుతున్నారు.. కార్మికులపై అధికారులు ఇంత కర్కశంగా వేధిస్తుంటే.. ఏ కార్మిక సంఘం పట్టనట్టు ఉండిపోతుందటపై విమర్శలు భగ్గుమంటున్నాయి.

- ముందుకు సాగని ఉత్పత్తి...

కార్మికులను ఇంతగా గోస పెడుతున్న అధికారులు ఏమైనా సాధిస్తున్నారంటే.. అదీలేదు. గనిలో ఉత్పత్తి పక్రియ గొర్రె తోక బెత్తడులా ఎలాంటి పురోగతిలేదు. లాంగ్ వాల్ ప్రాజెక్టు గా గొప్పలు చెప్పుకోడం వరకే సరిపోతుంది. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణ కోసం కోట్ల నిధులు ఖర్చు చేశారు. చేస్తూనే ఉన్నారు. పూర్తి మిషన్ మైన్ గా తీర్చిదిద్దేపేరిట అధికారులు ఏమిచేసినా చెల్లుబాటే. గని విస్తరణ పనులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. అధికారగణం శాంతిఖని ప్రాజెక్టును బంగారు గుడ్డు పెట్టే బాతుగా చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

కంపెనీ ప్రగతి అటుంచితే.. శాంతిఖని సింగరేణి ఉన్నతాధికారులకు కామధేనువుగా మారిపోయిందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ కోణంలోనే అధికారులు శాంతిఖనిని చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ సరియైన నిపుణుల ప్లానింగ్ దిశగా గని ముందుకు వెళ్లడంలేదు. శాంతిఖని భవిష్యత్ కు బాటలు వేద్దామన్న చిత్తశుద్ధి కార్పెట్ అధికారులు నుంచి స్థానిక గని స్థాయి అధికారుల వరకు మచ్చుకూ కనిపించడం లేదు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ పనులు డెడ్ లైన్ లక్ష్యంగా జరుగలేదు. ఇలా దీర్ఘకాలంగా లాంగ్ వాల్ ప్రాజెక్టు పనులను సాగధీస్తూ కాలంగడుపుతున్నారు. గత పదేళ్లుగా అధికారులు చేస్తున్నదీదే. అధికారులు మారంతవరకూ ఇక ముందు కూడా ఇలానే సాగతీతే ఉంటుంది.