6 May, 2026 | 1:29 AM

ఖబడ్దార్ కేటీఆర్..

06-05-2026 12:12 AM
  1. అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి లింకు పెడతావా..?
  2. తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు..
  3.   2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తాడా..?
  4. బండి సంజయ్‌కి దమ్ముంటే కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్‌కు సీబీఐ ద్వారా నోటీసులు ఇప్పించాలి..
  5. కరీంనగర్‌లో పీఎంజే జువెల్లరీ బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి..

కరీంనగర్,మే5(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేదంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.

కరీంనగర్ లో పీఎంజే జ్యువెల్లరీ షాప్ లో ఆదివారం జరిగిన సంఘటనలు గాయపడ్డ బాధితులను కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి మంగళవారం పరామర్శించారు. అనంతరం కరీంనగర్ లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.కరీంనగర్ జువెల్లరీ షాప్‌లో జరిగిన దొంగతనం కాల్పులఘటన దురాదృష్టకరమని మంత్రి అడ్లూరి అన్నారు. 

అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి వివరించారు. కరీంనగర్ దొంగతనం కేసులో నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

బాధితుల పరామర్శ పేరుతో కరీంనగర్ కు వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు.  అంతర్రాష్ట్ర దొంగలను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రితో పరిచయం ఉందని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.