ఆపరేషన్ వికటించి బాలింత మృతి
గజ్వేల్‌లోని లక్మీశ్రీనివాస దవాఖానలో ఘటన
మృతదేహంతో బంధువుల ఆందోళన
గజ్వేల్, మే 23 (విజయక్రాంతి) : ప్రసవానికి వెళ్లిన గర్భిణి ఆపరేషన్ వికటించి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రామయిపల్లి గ్రామానికి చెందిన భవాని(23) గజ్వేల్‌లోని లక్ష్మీశ్రీనివాస నర్సింగ్‌హోంలో డాక్టర్ మంజుల వద్ద గర్భం దాల్చిన రోజు నుంచి చికిత్స పొందుతుంది. నెలలు నిండిన భవానిని బుధవారం రాత్రి 11గంటలకు నర్సింగ్‌హోంకు తీసుకొచ్చారు. అక్కడ వైద్యురాలు భవానిని పరిశీలించగా సాధారణ కాన్పు కాకపోవడంతో గురువారం ఉదయం 7గంటలకు ఆపరేషన్ చేయగా భవాని మగబిడ్డకు జన్మనిచ్చింది.
కానీ గంట తర్వాత జననేంద్రియాల నుంచి తీవ్రరక్తస్రావం కావడంతో మూడు యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. కానీ రక్తస్రావం తగ్గకపోవడంతో డాక్టర్ మంజుల భవాని కుటుంబసభ్యులను సంప్రదించి భవాని గర్భసంచి తొలగించడంతో రక్తస్రావం ఆగిపోయింది. కానీ మధ్యాహ్నం 2గంటల సమయంలో భవాని నాలుక, కడుపు ఉబ్బడంతో గమనించిన కుటుంబ సభ్యులు వైద్యురాలికి తెలిపారు. వైద్యురాలు పరిక్షించి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు కొంపల్లిలో ఉన్న రష్ దవాఖానకు తరలించారు.
దవాఖానలో చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే భవాని చనిపోయింది. భవాని మృతికి గజ్వేల్‌లోని లక్ష్మీశ్రీనివాస నర్సింగ్‌హోం డాక్టర్ మంజులనే కారణమంటూ తమకు న్యాయం చేయాలని భవాని మృతదేహాన్ని దవాఖానలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. వైద్యం వికటించి భవాని మృతి చెందడంతో డాక్టర్ మంజుల తన నర్సింగ్‌హోం వద్ద బందోబస్తు కావాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో భవాని మృతదేహం దవాఖానకు చేరుకోకముందే పోలీసులు దవాఖాన వద్ద మోహరించారు. రాత్రి 10గంటల వరకు ఆందోళన కొనసాగింది.






