త్వరలోనే అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి): జంటనగరాలకు మరో ప్రతిష్టాత్మకమైన రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి వస్తోందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. విపరీతంగా పెరిగిన రైళ్ల రాకపోకలతో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే టెర్మినల్స్‌పై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగిందని, ఈ మూడు టెర్మినళ్లకు ప్రత్నామ్నాయంగా చర్లపల్లి మారుతుందని అన్నారు. రూ. 430 కోట్ల అంచనా వ్యయంతో తుదిరూపు దిద్దుకుంటున్న చర్లపల్లి టెర్మినల్‌ను గురువారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
జరుగుతున్న పనులను పరిశీలించారు. కోచ్ నిర్వహణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిపై సమీక్షించారు. అంతర్జా తీయ స్థాయి విమానాశ్రయం తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న ఈ టెర్మినల్ పనులను అత్యంత నాణ్యతతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రెండో దశ రైల్వే సేవలు అందుతాయన్నారు. స్త్రీలు, పురుషులకు ప్రత్యేక అధునాతన వెయిటింగ్ హాళ్లు, ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ లాంజ్, రెస్టారెంట్లు, విశాలమైన కాన్‌కోర్స్ ఏరియా ఉంటుందన్నారు.
ముఖద్వారం ఆకట్టుకునే లైటింగ్‌తో చక్కని ఎలివేషన్‌తో తీర్చిదిద్దుతున్నామని జైన్ తెలిపారు. 24 బోగీలున్న రైళ్లు కూడా ఆపేందుకు వీలుగా 9 ప్లాట్‌ఫాంలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విశాలమైన పాదచారుల వంతెనలతో పాటు 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ స్టేషన్ నుంచే రైళ్లను నడిపించేందుకు కోచ్ నిర్వహణ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం మౌలాలీ అమ్ముగూడ సనత్‌నగర్ మధ్య తనిఖీలు చేపట్టారు. సనత్ నగర్ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.






