15 April, 2026 | 5:52 AM

భూతల స్వర్గధామం ములుగు అందాలు

01-01-2026 01:24 AM
  1. పర్యాటకులకు సాదర ఆహ్వానం 
  2. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
  3. తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాల ప్రారంభం

ములుగు, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉందని, సహజ సిద్ధ ప్రకృతి అందాలు, భక్తి , ఆనందం, -ఆహ్లాదంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయని, పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డి.ఎఫ్.ఓ. రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం మంత్రి సీతక్క, అధికారులు సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్‌లో సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్‌లోని తాడ్వాయి హాట్స్‌ను ఆధునీకరించి, సుందరీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హాట్స్‌ను, 18 కిలోమీటర్లు మేర సఫారీ చేయడానికి 2 సఫారీ వాహనాలను ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రానికి సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండ కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు రావాలని మంత్రి సీతక్క కోరారు. ఆమె వెంట ఎస్పి సధీర్ రామ్ నాథ్ కేకన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఉన్నారు.