calender_icon.png 19 December, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజశ్రేయస్సు లక్ష్యంగా ఖైదీల ప్రవర్తన మారాలి

19-12-2025 12:54:02 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ 

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, డిసెంబర్ 18 (విజయక్రాంతి):.నేరమయ జీవితం మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేస్తుందని, విశాల సమాజం మధ్య జీవించడంలోనే మనుషుల జీవితాలకు సార్థకత లభిస్తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి.వి.ఎన్ భారత లక్ష్మీ అన్నారు. గురువారం ఆమె న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ తో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. వారివెంట కేంద్ర కారాగార సూపరింటెండెంట్ చింతల దశరథం, జైలర్ ఉపేంద్ర ఉన్నారు.

జిల్లాజడ్జి భారత లక్ష్మీ మహిళ ఖైదీల బ్యారక్, పురుష ఖైదీల బ్యారక్, వంటగది,ప్రాథమిక వైద్య చికిత్స కేంద్రం, మాదకద్రవ్య వ్యసన నివారణ కేంద్రం, నర్సరీ, వస్త్ర తయారీ యూనిట్ ను ఆమె పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాటామంతి షురూ చేసి వారి బాగోగులు తెలుసుకున్నారు.అనుకోని చేసిన నేరాలు కొన్ని, అనుకోకుండా చేసిన నేరాలు మరికొన్ని, పరిస్థితుల ప్రభావం వలన చేసిన నేరాలు ఇంకొన్ని,ఏవైనా నేరాలు నేరాలేనని ఆమె తెలిపారు.

ఖైదీలు మంచి మార్పు దిశగా అడుగులు వేయాలని అన్నారు. తమను తాము సంస్కరించుకునే కృషిలో ఉంటే ఖైదీలకు న్యాయసేవ సంస్థ తోడుగా నిలుస్తుందని ఆమె తెలిపారు.ఒక ఖైదీ వెనుక అతని కుటుంబం, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉంటారని వారి అందరి మధ్య జీవించడంలోనే జీవిత పరమార్థం ఉన్నదని ఆమె ఉద్బోడించారు.మంచిని బోదించిన మహర్షులే మనకు ఆదర్శం కావాలన్నారు.

సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలే కాని సమాజ ప్రగతి నిరోధకంలో కాదని ఆమె అన్నారు. కోర్టుల ద్వారా శిక్షలకు గురైన ఖైదీలు పరివర్తన చెందాలని, కారాగారంలో ఉన్న చేతి వృత్తులను ఎంచుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. మధ్యానికి, మాదకద్రవ్యాలకు వ్యసనపరులైన వారికి చికిత్స అందించి వాటి నుండి బయటపడే మార్గాలు మానసిక వైద్యనిపుణులు సూచిస్తారని వాటిని తూచతప్పకుండా పాటించాలని ఆమె పేర్కొన్నారు.

కారాగారాలు అనే కాంట్రీటు గోడలలో ఉన్నామనే ఆలోచనను వదులుకుని, మిమ్మల్ని మీరు మలుచుకుంటే మట్టిలో మాణిక్యాలు వెలికితీసే మంచి మనుషులు కాగలరనే విశ్వసాన్ని జిల్లాజడ్జి భారత లక్ష్మీ వ్యక్తం చేశారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ... ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అండగా ఉండి న్యాయసేవలు లీగల్ డిఫెన్స్ ఎయిడ్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా అందిస్తామన్నారు.