తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే హక్కే లేదు
ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు.. డిలిమిటేషన్ బిల్లు
హనుమకొండ, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో, డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 2029 ఎన్నికల్లో బీజేపీ గెలుపు కుట్రలు చేస్తుందని, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, డీ లిమిటేషన్ బిల్లు అని అందుకే ఇండియా కూటమి వ్యతిరేకించినట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.
డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తులు బీజేపీకి తలవంచి దక్షిణాది ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని, జనగణన, డిలిమిటేషన్ పేరుతో మహిళల ఆశలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటన్నారు.
మహిళలపై కపట ప్రేమ నటిస్తున్న బీజేపీ మహిళా రిజర్వేషన్ను 2024లో ఎందుకు అమలు చేయలేద న్నారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఉపేక్షించబోమని, దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్లో బీజేపీ కూటమి తీసుకొస్తున్న బిల్లులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఎంపీలకు ముందస్తు సమాచారం లేకుండా, సరైన చర్చకు అవకాశం ఇవ్వకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి, ఏకతాటిపైకి వచ్చి బీజేపీ తీరును తిప్పికొడుతున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, 2023లోనే అన్ని పార్టీల సమ్మతితో బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేసిందని, కానీ బీజేపీ ప్రభుత్వం ‘జనగణన’ ‘డిలిమిటేషన్’ పేర్లతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఇది నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే 2024కే అమలు చేయాలి. కానీ అమలు చేయకుండా వాయిదా వేయడం వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఎంపీ స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






