ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆదివారం, జిల్లాలోని నర్మెట్ట మండలంలోని హన్మంతాపూర్లో, అలాగే తరిగొప్పుల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కేంద్రాల్లో రైతులకు అందిస్తోన్న మౌలిక వసతులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. టోకెన్ విధానం అమలులో ఉందా? అనే అంశాన్ని పర్యవేక్షిస్తూ, నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. కేంద్రాల్లో తాడిపత్రిలు, గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా?అని పరిశీలించారు. టోకెన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ధాన్యం తేమ శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు.
అలాగే రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఎక్కువ సేపు వేచి ఉండే పరిస్థితులు రాకుండా కాంటాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, రికార్డులను సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






