31 March, 2026 | 3:46 PM

సన్నవడ్లకే బోనస్ అంటే దగా

16-05-2024 01:07 AM

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలు

ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలపై ఆందోళన బాట

కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ పిలుపు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి) : రాష్ట్ర రైతులను ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా సన్న వడ్లకు మాత్ర మే బోనస్ ఇస్తామనడం అన్నదాతలను వంచించడం, దగా చేయడమేనని విమర్శించారు. 

రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ఎట్లా ప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం తెలంగాణ రైతులను నిలువునా మోసం చేయడమేనని మండిపడ్డారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్‌కు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకుందని అన్నారు.

రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనకుండా నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.