మహిళా వైద్యులపై వేధింపులు
కామారెడ్డి కలెక్టర్, ఉన్నతాధికారులకు మహిళా వైద్యుల ఫిర్యాదు
అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ విచారణ
మహిళా డాక్టర్ల నుంచి వివరాల సేకరణ
ఉద్యోగులను వేధించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
కామారెడ్డి, మే 15 (విజయక్రాంతి): కామారెడ్డి వైద్యారోగ్య శాఖలో మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల విషయం కలకలం రేపింది. డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ ఏడాది కాలంగా తమను వేధిస్తున్నారంటూ పలువురు మహిళా వైద్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం వైద్యారోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ కామారెడ్డిలో విచారణ చేపట్టారు. డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్ తమను వేధిస్తున్న తీరును మహిళా వైద్యులు అమర్‌సింగ్‌కు వివరించారు.
కఠినచర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌నాయక్‌ను ప్రశ్నించారు. ఇదేమి పద్ధతి? అంటూ మందలించారు. మీ కుటుంబ సభ్యులతో ఇలా ప్రవర్తిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. దీంతో శ్రీనివాస్‌నాయక్ తప్పుందని బదులిచ్చారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్‌నాయక్‌పై ఏం చర్యలు తీసుకున్నారని డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను ప్రశ్నించారు. రివ్యూ సమావేశాల్లో పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడటం సిగ్గు లేదా? అని అన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్‌ను కోరారు.
లైంగిక వేధింపులపై మహిళా వైద్యులు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కాగా, తనపై దురుద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేశారని డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. విధులు సక్రమంగా నిర్వహిం చాలని ఆదేశించినందుకే ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో లక్ష్మణ్ సింగ్, శ్రీనివాస్‌నాయక్ సెలవు పెట్టి వెళ్లినట్టు సమాచారం.




