02-02-2026 01:54:27 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే రాష్ట్రాల సమూహం. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెబితే, కేంద్రం మాత్రం ఈ బడ్జెట్‌లో ఆ మూలసూత్రాన్నే విస్మరించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ జీడీపీలో 5 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గర్హనీయమని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్రం తరచూ వల్లించే ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ అనే నినాదం ‘తెలంగాణ’ విషయంలో కేవలం నీటి మూటలేనని మరోసారి ఈ బడ్జెట్‌లో స్పష్టం అయ్యిందని వెల్లడించారు. ఓ వైపు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే, మరోవైపు నిధుల కేటాయింపుల్లో తెలంగాణ పట్ల రాజకీయ వివక్ష చూపడం రాజ్యాంగ నైతికత అనిపించుకోదని హితవు పలికారు. ‘బడ్జెట్ అనేది ఆర్థిక హేతుబద్ధత ఆధారంగా రూపొందించాలి.
కానీ.. కేంద్రం రాజకీయ అనుకూలతకు ప్రాధాన్యతనిచ్చి తాజా బడ్జెట్‌లో తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది’ అని వివరించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ.22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది సుమారు రూ.4,000 కోట్లు మాత్రమే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు.
ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేతకు మరో సాక్ష్యం’ అని వెల్లడించారు. ‘రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ అనేది సమ న్యాయంగా జరగాలి. కానీ, సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత సమాఖ్య ధోరణిని ప్రదర్శిస్తోందని తాజా బడ్జెట్ మరోసారి రుజువు చేసింది’ అని తెలిపారు.
‘రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్-2, గోదావరి--మూసీ అనుసంధానం, బందరు పోర్టు -హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని మేము పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలబిస్తోన్న వివక్ష పూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
‘హై స్పీడ్ రైల్ కారిడార్స్’తో తెలంగాణకు మమ అనిపించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇకనైనా కేంద్రం తన ధోరణిని వీడి, రాజ్యాంగబద్ధమైన సమానత్వం పాటించాలని కోరారు.