02-02-2026 01:51:18 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణం పనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సొరంగ మార్గం పనులను నిరంతరం కొనసాగించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. సొరంగ నిర్మాణ పనుల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించా రు.
అర్ధంతరంగా నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు చేపట్టిన హెలి-బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులపై ఆయన ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం లో మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని తెలిపారు.
సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొంది ంచిన నివేదిక దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగమార్గం పూర్తి చేయడానికి ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్త్రీయ పద్ధతిలో నిరంత రం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని అధి కారులను ఆదేశిం చారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్‌కు సహకరించేలా ఉండేందు కు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులు అవుతారని చెప్పారు. అదే సమయంలో సొరంగ మార్గంలో ఏర్పడుతున్న పరిణామాలను అంచనా వేసేందుకు ప్రత్యేక జియో టెక్నికల్, జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
వేగవంతం చేయాలి
కాళేశ్వరం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులు వేగవంతంచేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలను, డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వ్యయం ఆవశ్యకత గురుంచి ఆయన వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్, ప్రాజెక్ట్ డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్‌లకు దశలవారీగా అనుమతులు పొందడం సులభతరమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 16 తరువాత ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు.