అది బడ్జెట్ కాదు.. అంకెల గారడీ
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్
భీమదేవరపల్లి, మార్చి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాలను రేకెత్తిస్తోందని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా లేద ని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ను ‘బోగస్ బడ్జెట్‘ గా అభివర్ణించారు. ప్రభుత్వం అంకెలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది వాస్తవాలకు దూరంగా ఉన్న ‘అవాస్తవ బడ్జెట్‘ అని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో సరైన నిధుల కేటాయింపులు లేవని, కేటాయించిన నిధు లు ఏమాత్రం సరిపోవని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమలుపై స్పష్టత లేదని, బడ్జెట్ ప్రసంగంలో వీటి గురించి సరైన ప్రకటన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు ఏళ్లలోనే భారీగా అప్పులు చేసిందని, ఇది రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెన్షనర్లు, సింగరేణి కార్మికులు, మహిళలు, సంక్షేమ రంగాలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ఆనాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. 420 హామీలు ఇచ్చి కేవలం నామ మాత్రంగా కూడా ఒకటి రెండు అమలు చేయడం లేదని అన్నారు.
రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ.. రాష్ట్ర పరువును బజారుకుడిస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని దివాలా తీసింది అని పేర్కొంటూ.. జాతీయస్థాయిలో రాష్ట్ర పరువు తీస్తున్నారని అన్నా రు. సీఎం తీరు కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, రైతులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలుచోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు రైతులకు యువతకు విద్యార్థులకు సీఎం భరోసా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. గతంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పులు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలను విద్యారంగాన్ని తీవ్రంగా విస్మరించారని తెలిపారు.




