26 March, 2026 | 3:34 AM

పన్నులు చెల్లించండహో!

26-03-2026 01:58 AM

పట్టణాలు.. పల్లెల్లో.. పన్నుల వసూళ్ల టార్గెట్

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఆర్థిక సంవత్సరం ముగింపు కు మరో ఐదు రోజులే గడువు ఉండగా పట్టణాలు, పల్లెల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్ను వసూళ్ల టార్గెట్ అధిగమించడానికి మున్సిపల్, పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా పన్ను వసూళ్లకు తిరుగుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ తో పాటు గ్రామాల్లో పన్ను వసూలుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించడంతోపాటు ఇంటింటికి సిబ్బంది తిరుగుతున్నారు. అయితే ఇప్పటివరకు 60 నుంచి 70 శాతం మాత్రమే పన్ను బకాయిలు వసూలు అయిందని, 30 శాతానికి పైగా బకాయిలు వసూలు కావాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు రోజుల గడువులో పన్ను బకాయిలు 100 శాతం వసూలు చేయడం కష్టతరమేనని చెబుతున్నారు.

మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు, ఇప్పటివరకు వసూలు శాతం

వర్ధన్నపేట:1.14 కోట్లు 56.64 శాతం

ములుగు:1.27 కోట్లు 55.91

నర్సంపేట: 4.53 కోట్లు 54.08

డోర్నకల్:1.42 కోట్లు 51.75

కేసముద్రం:1.05 కోట్లు 68.57

భూపాలపల్లి:6.08 కోట్లు 58.58

పరకాల:3.82 కోట్లు 58.90

మరిపెడ:2.09 కోట్లు 44.50

జనగామ:6.15 కోట్లు 58.47

తొర్రూరు:4.85 కోట్లు 67.63

స్టేషన్ ఘనాపూర్:2.14 కోట్లు 44.86

మహబూబాబాద్:6.80 కోట్లు 61.76

గ్రేటర్ వరంగల్:181.50 కోట్ల రూపాయలు పన్నులకు 43.92 పన్ను వసుళ్ళ లక్ష్యాన్ని మాత్రమే పూర్తి చేశాయి. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసముద్రం మున్సిపాలిటీ మాత్రమే 68.57 శాతం పనులు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన మున్సిపాలిటీల్లో కొన్ని 60 శాతం, మరికొన్ని మున్సిపాలిటీలో 30 నుంచి 50 శాతం పన్ను వసూలు చేశాయి.

పన్ను చెల్లించాలంటూ మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా మైకు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా బకాయి చెల్లించాలని, లేనిపక్షంలో రెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. గడువులోగా పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పల్లెల్లో కూడా ఇదే తరహా!

మహబూబాబాద్ జిల్లాలో పల్లెల్లో ఇంటి పన్ను బకాయి వసూళ్ల లక్ష్యం నెరవేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 గ్రామ పంచాయతీలు ఉండగా ఇంటి పన్నులు 4.90 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 60 శాతానికి పైగా ఇంటి పన్ను వసూలు అయింది. మిగిలిన 40 శాతం పన్ను మరో ఐదు రోజుల్లో వసూలు చేయడం కష్టమైన పనిగా పేర్కొంటున్నారు.

గత ఏడాది 93 శాతం ఇంటి పన్ను బకాయిలు వసూలు చేయగా, ఈసారి కాస్త అటు ఇటు గానే పన్ను బకాయిల వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వందకు వందశాతం అటు మున్సిపాలిటీలు, ఇటు పల్లెల్లో వసులయ్యే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.

సిబ్బంది కొరత

పట్టణాలు, పల్లెల్లో పన్ను బకాయిల వసుళ్ళకు సిబ్బంది కొరత తీవ్రంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఆఫీసర్ ఉండాల్సి ఉండగా, 40 శాతం లేరని, అలాగే బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల పన్ను బకాయి వసూళ్లకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.

పూర్తిస్థాయిలో వార్డు ఆఫీసర్లు, సిబ్బందిని నియమిస్తే గడువుకు ముందే పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. చిన్నచిన్న పద్ధులను పట్టించుకోకుండా, పెద్ద బకాయిలను వసూలు చేయడానికి దృష్టి కేంద్రీకరించడం వల్ల పన్ను వసూళ్ల లక్ష్యం 100 శాతం నెరవేరడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గడువులోగా చెల్లించాలి

మున్సిపాలిటీలకు బకాయి ఉన్న పన్నులను ప్రజలు గడువులోగా చెల్లించాలి. ఆన్లైన్, ఆఫ్లైన్, మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పన్ను బకాయిలు చెల్లించవచ్చు. మున్సిపాలిటీలకు బకాయి పడ్డ పనులను చెల్లిస్తే వడ్డీ భారం లేకుండా ఉంటుంది. పన్ను చెల్లించడం వల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుంది. 

శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం